ఒకప్పుడు పల్లెల్లో పొలం గట్లపై, విద్యుత్ తీగలపై తరచూ కనిపించిన తెలంగాణ రాష్ట్ర పక్షి.. ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతోంది. దసరా పండుగ రోజు జమ్మిపూజ తర్వాత పాలపిట్టను చూడటం శుభప్రదమనే నమ్మకం ఎప్పటి నుంచో ఉంది.
కనుక ఈ సంప్రదాయాన్ని కొందరు సొమ్ము చేసుకునేందుకు అక్రమంగా పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో బంధించి, ప్రజలకు చూపించి అందినకాడికి పైసలు దండుకుంటున్నారు. అయితే రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టలను పట్టుకోవడం, పంజరంలో బందించడం వన్యప్రాణి చట్టం ప్రకారం నేరం. గతేడాది ఇలా బంధించిన 28 పాలపిట్టలను అటవీశాఖ అధికారులు కాపాడి మళ్ళీ అడవులలో విడిచిపెట్టారు. కానీ ఈసారి ఎవరైనా పాలపిట్టలను బందించి పట్టుబడితే నేరుగా జైలుకి పంపిస్తామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
సంప్రదాయాన్ని కొనసాగించాలంటే పాలపిట్టలను బంధించడం కాదు.. వాటి సహజ ఆవాసాలను కాపాడాలని హితవు పలికారు.
కనుక ఈ ఆనవాయితీ కోసం పాలపిట్టల జోలికి ఎవరూ పోకుండా అవి నివాసం ఉండే చెట్ల వద్దకో లేదా అవి కనిపించినప్పుడో చూసి సంతోషపడటం మంచిది.