తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ వ్యవహారం మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్రలు జరిగాయని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. దీనిపై ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
గోషామహల్‌లో ముందుగానే ముద్రించిన ఫామ్-7 దరఖాస్తులను పెద్ద సంఖ్యలో సిద్ధం చేసి, ఓటర్ల పేర్ల తొలగింపునకు ప్రయత్నించారని ఓవైసీ ఆరోపించారు. నియోజకవర్గంలో 28వ పోలింగ్ స్టేషన్ పరిధిలో 122 మంది ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఈ దరఖాస్తులు ఉపయోగించారని, కానీ వాటిలో పేర్కొన్నవారు 2002 నుంచి ఓటర్ల జాబితాలో ఉన్నారని ఓవైసీ తెలిపారు. ఈ దరఖాస్తులపై బీజేపీ సానుభూతిపరుడిగా పేర్కొంటున్న ఓ వ్యక్తి పేరు, ఫోన్ నంబర్ ఉన్నాయని ఓవైసీ ఆరోపించారు.
అయితే బీజేపీ మాత్రం ఇలాంటి ఫామ్-7 దరఖాస్తులను సమర్పించడంలో తమ బూత్ లెవల్ ఏజెంట్లకు సంబంధం లేదని ఇప్పటికే ఖండించింది.
ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వెంటనే స్పందిస్తూ తప్పుడు వివరాలతో దాఖలు చేసిన ఫామ్-7 దరఖాస్తులు సమర్పించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందుగా నిబంధనల ప్రకారం విచారణ జరపాలని స్పష్టం చేశారు.