ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

October 01, 2026


img

ఓ పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక గురించి ఏమేమో మాట్లాడేస్తుంటే, వాటికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదని ఎన్నికల సంఘం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. 

దానం నాగేందర్‌ ఎన్నిక చెల్లదంటూ పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున దానిపై తుది తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నిక నిర్వహించబోమని ఈసీ స్పష్టం చేసింది.

దానం నాగేందర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ విజయారెడ్డి 2023లో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై ఇంకా విచారణ పూర్తవలేదు. కనుక ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహించిన తర్వాత కోర్టు తీర్పు భిన్నంగా ఉంటే న్యాయపరమైన సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక కోర్టు తుది తీర్పు తర్వాతే ఖైరతాబాద్‌ స్థానానికి ఉప ఎన్నికపై తదుపరి చర్యలు చేపడతామని ఎన్నికల సంఘం తెలిపింది. 

దీంతో అనర్హత కారణంగా ఖాళీ అయిన ఈ స్థానానికి వెంటనే ఉప ఎన్నిక జరుగుతుందన్న అంచనాలకు ప్రస్తుతానికి తెరపడింది. కనుక కోర్టు తుది తీర్పు ఎప్పుడు వెలువడుతుందో తెలీదు. ఒకవేళ వెలువడినా దానిపై విజయారెడ్డి లేదా దానం నాగేందర్‌ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే మళ్ళీ అక్కడ ఆలస్యం అవుతుంది. కనుక ఇప్పట్లో ఖైరతాబాద్ ఉప ఎన్నిక లేనట్లే భావించవచ్చు. 



Related Post