ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ మృతి

October 13, 2026
img

ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడు సత్యనారాయణ సోమవారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

హకీంపేటలో బతుకమ్మ వేడుకల్లో తన కళా ప్రదర్శన ముగించుకుని కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా అయన కారుని ఢీ కొట్టి వెళ్ళిపోయిన వాహనాన్ని గుర్తించి దాని కోసం గాలింపు మొదలుపెట్టారు. 

సత్యనారాయణ గత 15 ఏళ్లుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ రంగాల్లో కళాకారుడిగా కొనసాగుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల మాటలను అనుకరించడంతో పాటు, బొమ్మలతో మాట్లాడించే వెంట్రిలాక్విజం కళలోనూ ఆయన నిష్ణాతుడు. ఇప్పటివరకు 2 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. 

తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల వేణుతో పాటు పలువురు కళాకారులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related Post