హైదరాబాద్, ఎల్బీనగర్-హయత్‌నగర్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావించింది. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి దీని గురించి చర్చించగా ఆయన వెంటనే ఆమోదం తెలిపారు.
పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు పర్వతమాల పథకం కింద రాష్ట్రంలో కొత్తగా ఐదు రోప్‌వేల ఏర్పాటుకు కూడా అయన ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.1,230 కోట్లుగా ఉంది.
అలాగే ‘సేతు బంధన్’ పథకం కింద మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు కూడా ఆమోదం తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి 167కెకి అడ్డుగా ఉన్న కృష్ణా నదిపై ఓ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి శంకుస్థాపనకు నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.
హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి-765పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) సిద్ధం చేయాలని అయన అధికారులను ఆదేశించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.