ఉత్తర తెలంగాణలో అత్యంత ప్రధానమైన కరీంనగర్-వరంగల్ మద్య (68 కిమీ) జాతీయ రహదారి (ఎన్హెచ్-563) నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ప్రధాని మోడీ డిసెంబర్లో దీనిని ప్రారంభించబోతున్నారు.
ఈ హైవేలోనే భాగంగా కరీంనగర్-జగిత్యాల (59 కిమీ)ను కలుపుతూ నాలుగు లేన్ల రోడ్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ నెలాఖరున టెండర్లు ఖరారు చేస్తారు. ఆ తర్వాత వెంటనే దాని నిర్మాణ పనులు కూడా ప్రారంభం అవుతాయి.
ఎన్హెచ్-563పై గరిష్ఠంగా గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించేలా రోడ్డు నిర్మించారు. కనుక కేవలం 40 నిమిషాల్లో కరీంనగర్ నుంచి వరంగల్ చేరుకోవవచ్చు. ఇప్పటికే వాహనాలను అనుమతిస్తున్నారు కూడా. కనుక ఈ హైవేపై టోల్ ప్లాజా ఏర్పాటు చేసి ఈ నెల 15 నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో రిజిస్టర్ అయిన కార్లు, వ్యాన్లు వంటి తేలికపాటి వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి రూ.80 వసూలు చేస్తారు. ఇతర జిల్లాల్లో రిజిస్టర్ అయిన వాహనాలకు రూ.160 చెల్లించాల్సి ఉంటుంది. ఏడు లేదా అంతకంటే ఎక్కువ టైర్లు ఉన్న భారీ వాహనాలు ఈ హైవేపై ఒకవైపు ప్రయాణానికి రూ.1,020గా టోల్ రుసుము నిర్ణయించారు.
టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించేవారు నిత్యం వరంగల్కు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కనుక వారికి నెలకు రూ.360 టోల్ పాస్ సదుపాయం కల్పించనున్నారు.