ఈ ఏడాది ఉగాది పండుగ నాటికి (మార్చి 19) సనత్ నగర్‌లో టిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాకు తెలియజేశారు.
ఇప్పటికే హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లు, ఐసీయు, వెయ్యి పడకలతో వివిధ విభాగాల ఇన్ పేషంట్ వార్డులు, అవుట్ పేషంట్ వార్డు, వైద్యుల చాంబర్లు సిద్ధమయ్యాయని తెలిపారు. ఆపరేషన్ థియేటర్లలో, రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలలో ఎంఆర్‌ఐ, ఎక్స్-రే తదితర యంత్ర పరికరాలన్నీ అమర్చుతున్నారని త్వరలో వాటి కమీషనింగ్ పనులు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు.
సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాల అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిపేందుకు అవసరమైన వైద్య నిపుణులు, యంత్ర పరికరాలు, అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
టిమ్స్ హాస్పిటల్‌కు అవసరమైన వైద్య నిపుణులు, నర్సింగ్, వైద్య సిబ్బంది నియామకాలకు ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలియజేశారు.