దశాబ్ధాల క్రితం నిర్మించిన ఉస్మానియా హాస్పిటల్ శిధిలావస్థకు చేరుకుంటుండంతో, రాష్ట్ర ప్రభుత్వం ఘోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో అత్యాధునిక సదుపాయాలతో కొత్త హాస్పిటల్ నిర్మించబోతోంది. దీని కోసం 26.30 ఎకరాల విస్తీర్ణం గల పోలీస్ గ్రౌండ్స్‌ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయించింది. ఇప్పటికే దీని డ్రాయింగ్స్, డిజైన్లు ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11.45గంటలకు సిఎం రేవంత్ రెడ్డి దీనికి భూమిపూజ చేయబోతున్నారు.
సుమారు రూ.2700 కోట్లు వ్యయంతో ఉస్మానియా నూతన హాస్పిటల్ నిర్మించబోతోంది. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 బ్లాకులతో నిర్మించబోతున్న నూతన ఉస్మానియా హాస్పిటల్లో మొత్తం 2,000 పడకలు ఉంటాయి. దీనిలో సాధారణ జలుబు జ్వరాలకు చికిత్సలు మొదలు గుండె, మెదడు, కాలేయం, కిడ్నీల శస్త్ర చికిత్సలు, అత్యాధునిక రోబోటిక్ శస్త్ర చికిత్సలు లభిస్తాయి. వీటి కోసం 30 విభాగాలు ఏర్పాటు చేస్తారు.
హాస్పిటల్‌కు అనుబందంగా మెడిసన్, నర్సింగ్ కళాశాల, వైద్య విద్యార్ధులకు హాస్టల్స్, విద్యుత్ సబ్ స్టేషన్, ఫైర్ స్టేషన్, మల్టీ లెవెల్ వెహికల్ పార్కింగ్, క్యాంటీన్, వగైరా ఏర్పాటు చేస్తారు. అవుట్ పేషంట్ సేవల కోసం ఆస్పత్రిలో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులు కేటాయిస్తారు.
ఉస్మానియా హాస్పిటల్ భూమిపూజ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డితో పాటు డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు.