మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా చేస్తున్న ‘వీసా.. వింటారా సరదాగా’ నుంచి ‘అనగనగా అమెరికా... ‘ అంటూ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. సనారే వ్రాసిన ఈ పాటకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా, సంజిత్ హెగ్డే పాడారు. పెద్ద హీరోల ఇంట్రడక్షన్ సాంగులు వినీ వినీ చెవులు రక్తం కారుతున్న వేళ ఇలాంటి చక్కటి సాహిత్యం, సంగీతంతో మంచి పాట వినపడటం చాలా సంతోషమే.
అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలని కోరుకునే భారతీయ యువత గురించి ఈ సినిమా అని టైటిల్‌తోనే చెప్పేశారు దర్శకుడుగా పరిచయం అవుతున్న ‘ఉద్భవ్’. ఈ యూత్ ఫుల్ కామెడీ సినిమాలో శ్రీగౌరీ ప్రియ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: విజయ్ బుల్గానిన్ అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కాబోతోంది.