ఇదివరకు కేసీఆర్ సిఎంగా ఉన్నప్పుడు కోకాపేటలో భూములు వేలం వేస్తే ఎకరం రూ.11 కోట్లు పలికింది. కానీ ఎకరం రూ.1.05 కోట్లు చొప్పున శారదా పీఠానికి రెండు ఎకరాలు ఇచ్చారు. అక్కడ శారదా పీఠం ఇప్పటికే అక్కడ రాజశ్యామల ఆలయం, భవనాలు వగైరా నిర్మిస్తోంది. కానీ సంబంధిత అధికారులు ఈ విషయం ముందుగా సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు ముందుగా తెలియజేయలేదు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగం 300 ఎంజీడీ గోదావరి నీటిని తరలించేందుకు జలమండలికి ఆ ప్రాంతంలో 3.95 ఎకరాలు కేటాయిస్తూ కేటాయిస్తూ ఆమోదం తెలిపారు. సోమవారం ఉదయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.
కనుక జలమండలి అధికారులు ఆ 3.95 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు అక్కడకు వెళ్ళారు. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు పార్టీ నేతలను వెంటబెట్టుకొని వచ్చి రాజకీయాలు మొదలుపెట్టేశారు.
కేసీఆర్ ఆనవాళ్ళు చేరిపేయాలని పట్టుదలగా ఉన్న సిఎం రేవంత్ రెడ్డి, ఆయన కేటాయించిన ఈ స్థలంలో గుళ్ళు, గోపురాలు కూల్చేయడానికి కూడా వెనకాడటం లేదని విమర్శించారు. ఎట్టి పరిస్థితులలో ఆలయాన్ని కూల్చేందుకు ఒప్పుకోమని హెచ్చరించారు.
ఈ విషయం తెలుసుకొని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కూడా హడావుడిగా అక్కడకు వెళ్ళి శారదా పీఠం ఉత్తరాదికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో సమావేశమయ్యారు. అనంతరం ఆలయం జోలికి పోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అక్కడ వారు చేసిన హడావుడి గురించి తెలుసుకున్న సిఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం అధికారులతో సమావేశమైయ్యారు. అక్కడ ఆలయ నిర్మాణం జరుగుతోందనే విషయం ముందే ఎందుకు చెప్పలేదని చివాట్లు పెట్టారు. ఆ స్థలం, ఆలయం జోలికి వెళ్ళవద్దని ఆదేశించారు.
సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఆ 3.95 ఎకరాలు జలమండలికి కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది.