బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అనర్హత కేసులపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటి వరకు 8 మంది వివరణ తీసుకొని క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నేడు విచారించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తరపున న్యాయవాది, కడియం తరపు న్యాయవాది ఈ కేసుపై తమ వాదనలు వినిపించారు. తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలని వారు క్రాస్ ఎగ్జామ్ చేశారు. ఇరుపక్షాల వాదనలు ముగిసినందున దీనిపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మార్చి మొదటి వారంలో తుదితీర్పు (క్లీన్ చిట్) ఇచ్చే అవకాశం ఉంది.
మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాలేకపోయారు. కనుక తదుపరి విచారణ మార్చి 2కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. వీరిద్దరి విచారణ ముగించి తుది నిర్ణయం తీసుకుంటే, తర్వాత సుప్రీంకోర్టుకి తెలియజేయవలసి ఉంటుంది.