కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత మొదట పార్టీ పెట్టే ఆలోచన చేయలేదు. కానీ పార్టీని వీడిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి ఎదురుదెబ్బలు తగులుతుండటంతో పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్, మజ్లీస్ నాలుగు పార్టీలు బలంగానే ఉన్నాయి.
అయినా రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని భావిస్తున్నారు. దేనికంటే బీఆర్ఎస్ ప్రతిపక్షపార్టీగా పోరాడలేకపోతోందని వాదిస్తున్నారు. రాష్ట్రంలో బిజేపి ఎప్పుడూ గోడ మీద పిల్లిలానే వ్యవహరిస్తుంటుంది తప్ప తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నించదు.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉందని భావిస్టూ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపిస్తున్నారు. మే మొదటివారంలో పార్టీ ఏర్పాటవుతుందని తెలిపారు.
ఇక తమిళనాడులో జయలలిత, కరుణానిధి మరణాల తర్వాత డీఎంకే పగ్గాలు స్టాలిన్ చేబట్టి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అవుతానని గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే చాలా బలహీనపడింది. కనుక రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని భావించిన కమల్ హాసన్ రాజకీయాలలోకి వచ్చారు.
ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలమంది అభిమానులు ఉన్నప్పటికీ రాజకీయాలలో రాణించలేకపోతున్నారు... అని తెలిసి ఉన్నప్పటికీ మరో నటుడు విజయ్ టివికే పార్టీతో మరో రెండు మూడు నెలల్లో జరుగబోయే ఎన్నికలలో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. తాజాగా జయలలిత స్నేహితురాలు శశికళ కూడా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే రాజకీయ శూన్యత ఉందనే భావిస్తున్నారన్న మాట! ఉందో లేదో ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తే తెలుస్తుంది.
ఈలోగా అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, మాజీ సిఎం పళని స్వామి హటాత్తుగా పార్టీకి రాజీనామా చేసి తమ ప్రత్యర్ధి డీఎంకేలో చేరిపోయారు. అంటే ఎన్నికలకు ముందు బలాబలాలు, సమీకరణాలు మారుతున్నాయన్న మాట!