ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
పావలా శ్యామల జీవితం చరమాంకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ అత్యంత దయనీయమైన జీవితం గడిపారు. చనిపోయిన తర్వాత అయినా ఆమె కష్టాలు తీరేలా లేవు. ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారో తెలీని పరిస్థితి నెలకొంది. కనుక ఆమె మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.
పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. 1951లో గుంటూరు జిల్లాలో జన్మించారు. చిన్నతనంలో తల్లిని కోల్పోవడంతో ఆమె జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు.
ఆ తర్వాత నాటక రంగంలో ప్రవేశించి మంచి నటిగా గుర్తింపు పొందడంతో సినీ పరిశ్రమలో అవకాశాలు వచ్చాయి. 1985లో ‘బాబాయ్ అబ్బాయ్’ సినిమాతో ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అనేక సినిమాలలో రకరకాల పాత్రలు చేశారు.
‘స్వర్ణ కమలం’,’ఖడ్గం’ వంటి అనేక సినిమాలలో ఆమె నటించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వచ్చిన ‘ఆంధ్రావాలా’లో ఆమె పాత్ర పేరు ‘పావలా.’ అప్పటి నుంచే ఆమె పావలా శ్యామలగా పాపులర్ అయ్యారు.
ఆమె మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు చొరవ తీసుకొని ఆమెకు గౌరవ ప్రదమైన అంతిమ వీడ్కోలు ఇస్తారని ఆశిద్దాం.