పొరుగు రాష్ట్రంలో ఏపీలోని కాకినాడ జిల్లా, సామర్లకోట మండలంలోని వేట్లపాలెం సమీపంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ (బాణాసంచా ఫ్యాక్టరీ)లో శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు భారీ ప్రేలుడు సంభవించి, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు ఘటనా స్థలంలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు లోపల 50-60 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. కనుక మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టరీకి 5 కిమీ దూరంలో ఉన్న ఊర్లలో వారు ప్రేలుడు శబ్దం వినిపించిందని చెప్పారు. ప్రేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ళ గోడలు బీటలు వారాయి. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఫ్యాక్టరీకి కొంత దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల స్లాబ్‌లో పగుళ్ళు ఏర్పడ్డాయంటే ఈ ప్రేలుళ్ళు ఏ స్థాయిలో జరిగాయో ఊహించుకోవచ్చు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఆర్పుతూనే లోపల శిధిలాల కింద చిక్కుకున్నవారిని, మృతదేహాలను బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ కలెక్టర్ షన్మోమోహన్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, స్థానిక ఎమ్మెల్యేలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నారు. తిరుగు ప్రయాణంలో బహుశః ఘటనా స్థలానికి వెళ్ళే అవకాశం ఉంది.