మీ అహంకారం వల్లనే బీఆర్ఎస్‌ పార్టీ ఓడింది: కవిత

February 28, 2026


img

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకి రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎంత ఆచి తూచి స్పందించినా చెల్లికి అడ్డంగా దొరికిపోయారు.  

ఈ కేసు ప్రభావం ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీపై పడిందని ట్వీట్‌ చేసినందుకు, ఆమె అన్నపై నిప్పులు చెరిగారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేను నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలో ఓడిపోతే ధైర్యంగా నా ఓటమిని ఒప్పుకున్నాను. ప్రజల తీర్పు గౌరవిస్తున్నానని చెప్పానే తప్ప సాకులు వెతకలేదు. 

కానీ బీఆర్ఎస్‌ పార్టీ ఓటమికి ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం, ముఖ్యంగా మీ అహంకారమే కారణం అని తెలిసి ఉన్నా ధైర్యంగా ఒప్పుకోలేకపోయారు. 

పార్టీ కోసమే నేను జైలుకి వెళితే నన్ను పట్టించుకోలేదు. కానీ పార్టీ ఓటమికి నేను నా కేసు కారణమని కొత్త సాకు చెపుతున్నారు. మీ పెయిడ్ సోషల్ మీడియా బ్యాచ్ నన్ను ఎంత నీచంగా ట్రోల్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కానీ బతుకమ్మ చేతిలో  లిక్కర్ బాటిల్స్ పెట్టి ఫోటోలు పెట్టినప్పుడు కూడా స్పందించలేదు. అప్పుడే స్పందించి ఉండి ఉంటే నేడు మీ పార్టీకీ గతి పట్టి ఉండేదే కాదు. మీ అసమర్ధత, అహంకారం వలన బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోతే ఆ ఓటమిని నా మెడలో వేయాలనుకుంటే సహించే ప్రసక్తే లేదు.

రాజకీయాలు చేయాలంటే ధైర్యం ఉండాలి. నాకా ధైర్యం ఉంది కనుకనే జైలుకి వెళ్ళాను. పార్టీ పెడుతున్నాను. కానీ మీకా ధైర్యం లేనప్పుడు రాజకీయాలు దేనికి?” అంటూ కల్వకుంట్ల కవిత అన్న కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు.           


Related Post