మీ పిల్లలు లేదా మీ బంధుమిత్రుల పిల్లలు ఎవరైనా గుండె సంబందిత సమస్యలతో బాధపడుతున్నారా?అయితే వెంటనే హైదరాబాద్, నీమ్స్ హాస్పిటల్లో పేరు నమోదు చేయించుకోండి. ఈ నెల 22 నుంచి 28వరకు పిల్లలకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేస్తారు.
ఆర్ధిక ఇబ్బందుల వలన పిల్లలకు శస్త్ర చికిత్స చేయించలేక కుమిలిపోతున్న తల్లి తండ్రులు ఎందరో. వారి కోసమే బ్రిటన్ నుంచి డాక్టర్ రమణ దన్నప్పనేని బృందం హైదరాబాద్ వస్తోంది. ఏటా వారం రోజుల పాటు వారి వైద్య బృందం హైదరాబాద్ వచ్చి గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న పిల్లలకు ఉచితంగా నీమ్స్ హాస్పిటల్లో శస్త్ర చికిత్సలు చేస్తారు. గుండెలో రంధ్రం, ఇతర సమస్యలకు శస్త్ర చికిత్సలు నిర్వహించి సరిచేస్తారు.
తెలంగాణ ప్రభుత్వం సహకారంతో, నీమ్స్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమరేశ్వర రావు, సీనియర్ వైద్యులు డాక్టర్ గోపాల్ బృందం డాక్టర్ రమణ దన్నపనేని బృందంతో కలిసి ఈ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారు. అవసరమైనవారు వెంటనే హైదరాబాద్, పంజగుట్ట వద్ద గల నీమ్స్ హాస్పిటల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని ప్రొఫెసర్ డాక్టర్ అమరేశ్వర రావు తెలిపారు.