హైదరాబాద్‌లో గుట్టుగా కిడ్నీ మార్పిడి చికిత్సలు

January 23, 2025
img

హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో మాదక ద్రవ్యాలు వంటి అనేక కొత్త కొత్త సమస్యలు పెరుగుతున్నాయి. తాజాగా నగరంలో గుట్టుగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సల వ్యవహారం బయటపడింది. 

సరూర్ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో డాక్టర్స్ కాలనీలో గల అలకనంద హాస్పిటల్లో బెంగళూరుకి చెందిన ఓ వైద్యుడు రహస్యంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 

ఎల్బీ నగర్‌ ఏసీపీ కృష్ణయ్య, సరూర్ నగర్‌ ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, తమ బృందాన్ని వెంటపెట్టుకొని ఈరోజు అలకనంద హాస్పిటల్‌పై దాడి చేశారు. 

కానీ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్న వైద్యుడు తప్పించుకు పారిపోయాడు. పోలీసులు హాస్పిటల్‌ సీజ్ చేసి మేనేజర్‌ని అరెస్ట్‌ చేశారు. అతని ద్వారా అనేక విషయాలు బయటపడ్డాయి. 

బెంగళూరుకి చెందిన వైద్యుడు, బెంగళూరు, చెన్నైలకు చెందిన 8 మంది బ్రోకర్ల సాయంతో అత్యవసరంగా కిడ్నీలు మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారిని హాస్పిటల్‌కు తీసుకువస్తున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.50-55 లక్షలు చొప్పున వసూలు చేసేవారు. తర్వాత వారిలో సమంత్ అనే వ్యక్తి బెంగళూరు, చెన్నై నగరాలలో నిరుపేదలని గుర్తించి, వారికి ఒక్క కిడ్నీ ఇస్తే రూ.5 లక్షలు ఇస్తామని ప్రలోభ పెట్టి హైదరాబాద్‌ తీసుకువచ్చేవాడు. గత ఆరు నెలలుగా ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారం గురట్టుగా జరుగుతోంది. 

ఇటీవల ఓ న్యాయవాదికి, ఓ నర్సుకి అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉండటంతో చెన్నై నుంచి తీసుకువచ్చిన ఇద్దరు నిరుపేదలు (కిడ్నీ డోనర్లు) నుంచి సేకరించిన కిడ్నీలు తీసి వారికి అమర్చారు. 

ఈ చికిత్స చేసేందుకు బెంగళూరు వైద్యుడు ఒక్కో రోగి వద్ద రూ.50-55 లక్షల వరకు తీసుకొని రూ.5 లక్షలు బ్రోకర్లకు ఇచ్చేవారు. దానిలో వారు కొంత ఉంచుకొని మిగిలినది డోనర్ల చేతిలో పెట్టి వెనక్కు పంపించారని పోలీసులు కనుగొన్నారు. 

అలకనంద హాస్పిటల్లో సాధారణ వైద్య చికిత్సలు చేసేందుకు మాత్రమే అనుమతి తీసుకొని రహస్యంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తుండటం చూసి అందరూ నివ్వెరపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న ఆ వైద్యుడు కోసం గాలింపు మొదలుపెట్టారు.

Related Post