నేడు మూల నక్షత్రం సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్రం అమ్మవారికి చాలా విశేషమైనది. పైగా నేడు శుక్రవారం కూడా. కనుక చదువుల సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాలతో పాటు, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారు నేడు కాత్యాయని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
విద్యాభ్యాసం ప్రారంభించడానికి మూల నక్షత్రం అత్యంత అనుకూలమైన రోజుగా భక్తులు భావిస్తుంటారు. కనుక నేడు వందలాది మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆలయానికి రావడంతో వారితో చాలా సందడి నెలకొంది.
మూల నక్షత్రం సందర్భంగా భక్తుల రాక ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి, ఆలయ పరిసరాల్లో రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టారు. భక్తులు సౌకర్యవంతంగా అమ్మవారిని దర్శించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు.