పొరుగు రాష్ట్రంలో అనంతపురం జిల్లా రాప్తాడులోని జడ్పీ హైస్కూల్లో (10) తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థినిపై ఓ యువకుడు రంపం మెషిన్‌తో దాడి చేశాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలువురు సమాజంలో జరిగే ఇలాంటి నేరాలకు సినిమాలే కారణమంటూ విమర్శలు చేశారు.
వాటిపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీవ్రంగా స్పందించారు. ఆయన ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు. దానిలో నిజమైన సమస్యలను పక్కనపెట్టి, ప్రతీ ఘటనకు సినిమాలను బాధ్యులుగా చేయడం సరికాదన్నారు.
ఇలాంటి ఘోరమైన ఘటనలు జరిగినప్పుడు ముందుగా బాధితుల పట్ల సానుభూతి చూపించాలని, అసలు సమస్యకు గల కారణాలను విశ్లేషించాలని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. అంతేగానీ, సినిమాలను నిందించడం సరికాదన్నారు. బాధితులు, వారి కుటుంబాల పట్ల సానుభూతి చూపాల్సిన సమయంలో ఈవిధంగా ఇతరులపై వ్యక్తిగత విమర్శలు చేసేందుకు కొందరు అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా సినిమాల్లో అవకాశాలు లేక నిరాశలో ఉన్న కొందరు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హఠాత్తుగా సమాజ సంస్కర్తలుగా మారిపోతున్నారని విమర్శించారు.
ఒక విషాద ఘటన జరిగినప్పుడు కావాల్సింది బాధితుల పట్ల సానుభూతి మాత్రమేనని, దానిని వ్యక్తిగత అజెండాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని సందీప్ రెడ్డి వంగా తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సూపర్ హిట్ హిందీ సినిమాలు ‘యానిమల్’, ‘ధురంధర్’ వంటి సినిమాల్లోని అత్యంత హింసాత్మక సన్నివేశాలను పేర్కొంటూ సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో సందీప్ వంగా ఈవిధంగా స్పందించారు.