తెలంగాణ ఆర్టీసీలో మణుగూరు డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న ప్రవళిక హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు.
గత నెల 25న ఆమె భద్రాద్రి కొత్తగూడెం నుంచి బయలుదేరిన బస్సులో ప్రయాణికులకు టికెట్స్ ఇస్తున్నప్పుడు ఒక ప్రయాణికుడికి టికెట్ ఇచ్చిన తర్వాత చిల్లర విషయంలో చిన్న వాగ్వాదం జరిగింది. దాంతో ఆ ప్రయాణికుడు ఆవేశం పట్టలేక ప్రవళికను గట్టిగా తోశాడు. ఆ ధాటికి ఆమె నడుస్తున్న బస్సులో నుంచి క్రింద పడిపోయింది.
బస్సు వెనుక చక్రాల కింద ఆమె రెండు కాళ్ళు నలిగిపోయాయి. తలకు తీవ్ర గాయమైంది. ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్‌లో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి ప్రవళిక కన్ను మూసింది.
ఇంకా విషాదం ఏమిటంటే, ఆమె తండ్రి నాగరాజు ఆర్టీసీలో మెకానిక్‌గా పని చేసేవారు. అయన డ్యూటీలో ఉండగా చనిపోవడంతో 10 నెలల క్రితమే ప్రవళికకు ఈ కండక్టర్ ఉద్యోగం వచ్చింది.
కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఆమె ఈవిధంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రవళిక మృతి పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని మంత్రి ప్రకటించారు. ప్రవళిక మృతికి కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.