హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు, రుణాలు చెల్లింపు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.275 కోట్లు మంజూరు చేసింది. దీనిలో రూ.150 కోట్లు విస్తరణ పనుల కోసం కేటాయించగా, మరో రూ.125 కోట్లు రుణాల చెల్లింపుల కోసం కేటాయించింది. దీంతో మెట్రో రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించడమే కాకుండా పనులు మొదలు పెట్టేందుకు మార్గం సుగమం అయ్యింది.
హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా ఏడు కారిడార్లలో మొత్తం 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ ప్రాజెక్టుకు రూ.38,595 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసి, దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) కేంద్రానికి సమర్పించగా, ఆమోదం లభించింది.
రెండో దశలో శంషాబాద్ విమానాశ్రయం, కోకాపేట నియోపోలిస్, చాంద్రాయణగుట్ట ప్రాంతాలకు మెట్రో సేవలను విస్తరించనున్నారు.
అలాగే మియాపూర్ నుంచి పటాన్చెరు, ఎల్బీనగర్ నుంచి హయత్నగర్, మేడ్చల్ నుంచి శామీర్పేట మార్గాల్లోనూ మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి.
మెట్రో విస్తరణతో నగరంలోని శివారు ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఈ కొత్త కారిడార్స్ పనులు పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాల నుంచి రోజూ ఉద్యోగాలు, వ్యాపారాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రయాణ సమయం తగ్గి సౌకర్యంగా ఉంటుంది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ పనులు ఎప్పటి నుంచి మొదలు పెట్టి, ఎన్నేళ్ళలోగా పూర్తి చేస్తుందనేది సస్పెన్స్. ఎందుకంటే, మరో రెండేళ్ళలో ఎన్నికలు జరుగుతాయి. వాటి కోసం కనీసం ఏడాది ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. కనుక వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించి, శరవేగంగా పూర్తిచేయాల్సి ఉంటుంది.