విచిత్రం: రెండు హెలికాఫ్టర్లు ఢీ కొట్టాయి!

November 03, 2026
img

రైళ్ళు ఒకదానినొకటి గుద్దుకోవడం చూశాము. అలాగే రోడ్డుపై ప్రయాణించే బస్సులు, కార్లు, ఇతర వాహనాలు ఒకదానినొకటి గుద్దుకోవడం చూశాము.  కానీ నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సమీపంలో రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రెండూ ఒకే సమయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్నప్పుడు గుద్దుకున్నాయి.

ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 47 ఏళ్ల వసంత్ కుమార్ బలరాముడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లాలో పెరిచే హెలిప్యాడ్ వద్ద మంగళవారం ఉదయం 8:11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

ఫిష్‌టెయిల్ ఎయిర్, ఎయిర్ డైనాస్టీ రెండు వేర్వేరు సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ల్యాండింగ్ సమయంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన 49 ఏళ్ల శైలేష్ కృష్ణ పటేల్‌, రెండు హెలికాప్టర్ల పైలట్లు రవీంద్ర ప్రజాపతి, ప్రజ్వల్ కే.సీ. గాయపడ్డారు.

వీరిలో పటేల్, రవీంద్ర ప్రజాపతిని చికిత్స కోసం ఖాట్మండులోని ఆసుపత్రికి తరలించగా, మరో పైలట్‌కు లుక్లాలో చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై నేపాల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వచ్చే పర్యాటకుల రవాణా, అత్యవసర తరలింపులకు హెలికాప్టర్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు.

Related Post