సోమవారం హైదరాబాద్లో బీజేపీ అధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకలించి వేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా కాంగ్రెస్ పార్టీకి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు.
“కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశామని ఆరోపిస్తుంటుంది. అదే ఈవీఎంలతో ఎన్నికల్లో గెలిచినప్పుడు ప్రజల తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని గొప్పలు చెప్పుకుంటుంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయి కదా? ఈవీఎంలను ట్యాంపరింగ్ అయితే అక్కడ ఎలా గెలిచింది?” అని అమిత్ షా ప్రశ్నించారు.
సర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలపై అమిత్ షా తనదైన శైలిలో విశ్లేషించి సూటి ప్రశ్నలు వేశారు. “కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం బాగా అలవాటు. అందుకే సర్ పేరుతో ఆందోళనలు చేస్తోంది.
అక్రమంగా దేశంలోకి వచ్చినవారికి ఓటు హక్కు కల్పించి ఓటు బ్యాంకులు ఏర్పాటు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అలాగే చనిపోయినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగినవారిని గుర్తించి వారి పేర్లు ఓటర్ల జాబితాలో నుంచి తొలగిస్తే తప్పా?” అని అమిత్ షా ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. “సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఏటిఎంగా మార్చేశారు. ఆర్ఆర్ (రాహుల్ గాంధీ) టాక్స్ వసూలు చేసి కాంగ్రెస్ అధిష్టానానికి సమర్పించుకుంటూ తన పదవి కాపాడుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు.
కనీసం రైతులకు సాగు నీరు కూడా అందించలేని దుస్థితిలో వెంటిలేటర్ మీదుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశాయి. వాటిని శాశ్వితంగా కూకటివేళ్ళతో పెకలించివేస్తాము. రాష్ట్రంలో బిజేపి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి వేగవంతం అవుతుంది. అవినీతి అంతం అవుతుంది. వచ్చే ఎన్నికలలో బిజేపి గెలిచి తెలంగాణలో తప్పక అధికారంలోకి వస్తుంది,” అని అమిత్ షా అన్నారు.