ఇరుముడికి ఈ కొత్తముడి ఏమిటో?

November 01, 2026


img

రవితేజ, ప్రియభవానీ శంకర్, నక్షత్ర ప్రధాన పాత్రలు చేసిన ఇరుముడి సూపర్ హిట్ అయ్యింది. థియేటర్లోలో నుంచి ఓటీటీలోకి ఎప్పుడో వెళ్ళిపోయింది. అక్కడా దాని కథ ముగిసిపోయినట్లే. కానీ సినిమా విడుదలైన ఇన్ని రోజుల తర్వాత ఇరుముడికి ఊహించని కొత్త సమస్య వచ్చింది. ఆ సినిమాలో నటించిన నక్షత్ర మైనర్ బాలిక కనుక ఆమె విషయంలో వివరణ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ కార్మిక శాఖ ఆ సినిమా నిర్మాతలకు నోటీసులు పంపింది. 

కార్మిక శాఖ నోటీసులో కొన్ని ప్రశ్నలున్నాయి. నక్షత్ర తల్లితండ్రుల నుంచి లిఖితపూర్వకంగా  అనుమతి పొందారా లేదా? మైనర్ బాలికను సినిమాలో నటింపజేసేందుకు ముందుగా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా లేదా? షూటింగ్‌ సమయంలో ఆమె రోజుకు ఎన్ని గంటలు సెట్స్‌లో పని చేసేది?

ఆ సమయంలో ఆమెకు రక్షణగా తల్లితండ్రులు లేదా గార్డియన్ లేదా ఆమె కుటుంబం తరపున ఎవరైనా ఆమెతో ఉన్నారా లేదా? ఉంటే వారి వివరాలు, లేకుంటే ఎందుకు లేరో వివరణ. 

షూటింగ్‌ కారణంగా ఆమె చదువుకు ఆటంకం కలుగుతుంది. అందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? నిబంధనల ప్రకారం ఆమెకు పారితోషికం చెల్లించారా లేదా? చెల్లిస్తే దానిలో 20 శాతం ఆమె పేర ఫిక్స్ డిపాజిట్ చేశారా లేదా?సినిమా ప్రమోషన్స్, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొన్నందుకు వివరణ ఇవ్వాలంటూ కార్మిక శాఖ నోటీసులో పేర్కొంది.        

నిర్మాతలు లేదా వారి ప్రతినిధులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలతో నవంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కార్మికశాఖ కార్యాలయంలో విచారణకు హాజరయ్యి వివరణ ఇవ్వాలని కోరారు. 


Related Post

సినిమా స‌మీక్ష