హైదరాబాద్‌లో కొత్త దందా.. ఆడపిల్లల అండాల సేకరణ!

November 01, 2026
img

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలో రోజుకో కొత్త మోసం, అనూహ్యమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా యువతుల నుంచి ఆండాల సేకరణ, అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులు కనిపెట్టారు.  

బేగంపేటలోని ఓ గర్ల్స్ హాస్టల్‌పై పోలీసులు శనివారం రాత్రి సోదాలు చేయగా, దిగ్బ్రాంతి కలిగించే విష‌యాలు వెలుగు చూశాయి. 

కొందరు బ్రోకర్లు వివిధ రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి, ఈ హాస్టల్లో ఉంచి వారి నుంచి అండాలు సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్నారు. ఈ ముఠా ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులను ఎంచుకొని ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆవిధంగా తీసుకు రాబడిన 10 మంది యువతులను పోలీసులు సంక్షేమ హాస్టల్‌కు తరలించారు.

ఇది గర్ల్స్ హాస్టల్ అయినప్పటికీ కొన్ని గదులలో మగవారి దుస్తులు కూడా ఉండటంతో పురుషుల నుంచి కూడా వీర్యం సేకరించి అమ్ముకుంటున్నారా లేక హాస్టల్లో వ్యభిచారం జరుగుతోందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

హాస్టల్లో ఉన్న ఆ యువతులకు వైద్య పరీక్షలు చేయించి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి అనుమతి తీసుకున్న తర్వాత  వారిని ప్రశ్నింఛి ఈ అక్రమ దందా చేస్తున్న ముఠాలను, వారిని ఉపయోగించుకుంటున్న నగరంలోని ఫెర్టిలిటీ సెంటర్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం. 

Related Post