పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని, అధికారుల వ్యవహారశైలి, సీఎం వైఖరి పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని తెలంగాణ అధికారులు కోరుతుంటే, కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో రేవంత్ రెడ్డి పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సమ్మతి తెలిపారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. రేవంత్ ప్రభుత్వానికి నదీ జలాల వినియోగంపై సరైన అవగాహన, నిర్దిష్టమైన విధానం లేదని మండిపడ్డారు.
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటి హక్కులకు నష్టం జరుగుతుందని, రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన 250 టీఎంసీల గోదావరి జలాలను రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా ఇస్తున్నారంటూ కవిత విమర్శించారు.
అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సిఎం రేవంత్ ఈ ప్రాజెక్టుకు అంగీకరించి, బయటకు వచ్చాక మరోలా మాట్లాడారని ఆరోపించారు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి కలిగే నష్టాన్ని గుర్తించాలని కవిత డిమాండ్ చేశారు.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం నిర్వహించే సంప్రదింపుల నుంచి తెలంగాణ వైదొలగాలని, ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని ఆమె డిమాండ్ చేశారు