ఇందిరమ్మ కుటుంబ బీమా.. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు!

November 18, 2026


img

తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ అనే మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. 

వీటి దరఖాస్తుల ప్రక్రియను గురువారం నుంచే ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సిద్దిపేటలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. 

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఈ బీమా ఉపయోగపడనుంది. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది.

కుటుంబంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న సంపాదించే వ్యక్తిని బీమా కోసం ఎంపిక చేసుకోవచ్చు. కుటుంబంలో ఒక్కరే సంపాదిస్తుంటే వారికే బీమా వర్తిస్తుంది. ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదిస్తుంటే ఎవరికి బీమా కావాలో కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు.

రేషన్ షాపుల వారీగా అర్హులైన కుటుంబాలను గుర్తించి దరఖాస్తులు సేకరించనున్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడంతో పాటు స్వయం సహాయక సంఘాల సేవలను కూడా వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్, ఆన్‌లైన్ దరఖాస్తు సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

బీమా పొందే వ్యక్తి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకోవచ్చు. బీమా సొమ్మును నామినీలకు ఏ నిష్పత్తిలో అందించాలనేది కూడా నిర్ణయించుకోవచ్చు.

ఈ పథకం అమలుకు అయ్యే పూర్తి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


Related Post