తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో నేడు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి జలాల వినియోగం, ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులపై ప్రధానితో చర్చించారు.
అలాగే డిసెంబర్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు రావాల్సిందిగా ప్రధాని మోడీని ఆహ్వానించారు.
సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, వాటిని ఎదుర్కొనేందుకు కేంద్రం ఉదారంగా ఆర్ధిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
అలాగే తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి, సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ నుంచి అనుమతులు వచ్చేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును సమ్మక్కసాగర్ లేదా ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలని, ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే నీటిలో తెలంగాణకు 50 శాతం వాటా కేటాయించాలని కోరారు. సీతమ్మసాగర్ బ్యారేజీకి పర్యావరణ త్వరగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.