యుద్ధాల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ కారణంగా సరుకు రవాణ ఛార్జీలు పెరిగాయి. మరోపక్క ఎల్నినో కారణంగా వర్షాలు లేక పంటలు పండక కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అధిక ధరలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో రైతన్నల కష్టం, నష్టం ఎవరికైనా కంట తడి పెట్టిస్తుంది.
మన పొరుగు రాష్ట్రం ఏపీలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని ఐతవరం వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఒక రైతు సుమారు రెండువేల సొరకాయలు పారబోసి వెళ్ళిపోయాడు. బజారుకు తీసుకువెళ్తే రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదని ట్రాలీ ఆటోలో లేత సొరకాయలను రోడ్డు పక్కన పారబోసి వెళ్ళిపోయాడు.
ఆ దారిన పోయేవారు ఇది చూసి పోటీపడి సొరకాయలు మోసుకుపోయారు. బయట మార్కెట్లో పాడయిన, ముదురు సొరకాయలు ఒక్కొక్కటీ రూ.20-30 ధర పలుకుతోంది. కానీ రైతుకు మాత్రం దానిలో సగం ధర కూడా అందడం లేదు.
గత ప్రభుత్వం కంటే చాలా గొప్పగా రైతులను ఆదుకుంటున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటుంటే, మా హయంలోనే రైతులకు స్వర్ణయుగం, ఇప్పుడు వారిని పట్టించుకునే నాధుడే లేడు,” అంటూ ప్రతిపక్షపార్టీ నేతలు వాదిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వాలు, పాలకులు మారినా రైతన్న పరిస్థితి మాత్రం మారలేదని చెప్పడానికి ఇంత కంటే మంచి నిదర్శనం ఏముంది?