అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ వద్ద మిస్సిస్సిప్పి నదిలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఘోర ప్రమాదం జరిగింది.
లూసియానా రాష్ట్రంలో న్యూ ఓర్లీన్స్ పోర్టులో లంగరు వేసి ఆగి ఉన్న’అమెరికన్ హెరిటేజ్ క్రూయిజ్”ను 'అట్లాంటిక్ ఆస్ఫాల్ట్' అనే భారీ ట్యాంకర్ నౌక అదుపు తప్పి బలంగా ఢీ కొట్టింది.
ఆ ధాటికి ఐదు అంతస్తుల క్రూయిజ్ నౌక నదిలో ఒక వైపునకు ఒరిగిపోయి, అందరూ చూస్తుండగానే నదిలో మునిగిపోయింది.
అప్పటికే దానిలో సుమారు 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలో దూకేయగా, మిగిలినవారు కూడా నౌకతో సహా నీట మునిగారు.
అయితే ఈ ప్రమాదం పోర్టులో జరిగినందున అక్కడే ఉన్న కోస్ట్ గార్డ్, అగ్నిమాపక సిబ్బంది, ఇతర బోట్ల సిబ్బంది నదిలో మునిగిపోతున్నవారిని కాపాడారు. ఈ ప్రమాదంలో 32 మంది గాయపడ్డారు. కానీ క్రూయిజ్ సిబ్బందితో సహా180 మంది ప్రయాణికులు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు.
లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీ స్పందిస్తూ, “ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఒక్కరూ చనిపోకుండా అందరూ సురక్షితంగా బయటపడటం ఒక మహాద్భుతం. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ చర్యలలో పాల్గొని అందరినీ కాపాడిన ప్రతీ ఒక్కరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు,” అని అన్నారు.