బలగం సినిమాతో తెలంగాణ నేపధ్యంలో ఎటువంటి సినిమాలు తీయవచ్చో చూపారు వేణు యెల్దండి. సంగీత దర్శకుడుగా మంచి గుర్తింపు పొందిన దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా ఆయన దర్శకత్వంలో తీస్తున్న ఈ ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కనుక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు ఈ నమ్మకంతోనే ‘ఎల్లమ్మ’ని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. కనుక వేణు కూడా తొందరపడకుండా చాలా నిదానంగా ఆ స్థాయిలో సినిమా అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కనుక అందరూ ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కనుక చిత్ర బృందం ‘ఎల్లమ్మ’ సినిమా మ్యూజికల్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. ఇందులో మొదటి పాటను (లిరికల్ వీడియో సాంగ్) ఈ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ పూర్తయింది.
ఇక ఈ సినిమా టైటిల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 100 మంది జానపద కళాకారులతో కలిసి డీఎస్పీ ఈ పాటను రికార్డ్ చేశారు.
ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గ్రామీణ యువకుడు ‘పర్షి’గా నటిస్తున్నారు. అతనికి జోడీగా అనంతిక సనిల్ కుమార్ (మ్యాడ్, 8 వసంతాలు) నటిస్తోంది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, భాగ్యశ్రీ బోర్సే కీలకపాత్రలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వేణు ఎల్దండి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: మురళి చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దిల్ రాజు సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.