తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులకు అందిస్తున్న ‘తొలి ముద్ద’ అల్పాహార పథకాన్ని మరో ఏడు జిల్లాలకు విస్తరించింది.
ఇప్పటికే ఈ పధకం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో కొనసాగుతోంది.
నేడు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ పధకాన్ని జయశంకర్ భూపాలపల్లి, జనగాం, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు కూడా విస్తరించి అమలు చేసింది.
దీంతో మొత్తం 14 జిల్లాల్లో 1,35,453 మంది చిన్నారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది.అదనంగా 43,657 మంది చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం పౌష్టికాహారం అందనుంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు హాజరవుతున్నారు. వీరిలో చాలామంది ఉదయం అల్పాహారం తీసుకోకుండానే కేంద్రాలకు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రీ-స్కూల్ విద్యలో వారి అభ్యాస సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, యునిసెఫ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ నిపుణుల సూచనలతో ఉప్మా మిక్స్, ఖిచిడీ మిక్స్ అనే రెండు రకాల ఇన్స్టంట్ అల్పాహార మిశ్రమాలను రూపొందించారు. వీటి ద్వారా ఒక్కో చిన్నారికి రోజుకు 116.25 కిలో కేలరీల శక్తితో పాటు 3.9 గ్రాముల ప్రోటీన్ అందుతోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే మిగిలిన 19 జిల్లాల్లోనూ ‘తొలి ముద్ద’ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.