ఐవీఎఫ్ సెంటర్ల దోపిడీపై హైకోర్టు ఆగ్రహం

November 20, 2026
img

ఇటీవల హైదరాబాద్‌లో వెలుగుచూసిన అక్రమ ఎగ్ డొనేషన్ (మహిళల నుంచి అండాల సేకరణ) వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల నుంచి నిరుపేద, మధ్యతరగతి మహిళలను హైదరాబాద్‌ తీసుకు వచ్చి బేగంపేటలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంచి వారి నుంచి అండాలు సేకరిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. నగరంలో ఐవీఎఫ్ కేంద్రాలు ఈ ముఠాలతో టై అప్‌ చేసుకొని మహిళల నుంచి అక్రమంగా అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. 

ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు ఐవీఎఫ్ కేంద్రాల వైద్యులు, నిర్వాహకులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐవీఎఫ్ కేంద్రాల తరఫు న్యాయవాదులు ఏమన్నారంటే, అండాల సేకరణ నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని, తాము ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని కోర్టుకు తెలిపారు. 

అయితే ఈ వాదనలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వారికి అధిక మొత్తంలో హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలు విడుదలయ్యేలా చేయడం, వాటిని సేకరించడం, వారి ఆరోగ్యంతో ఆడుకోవడం కూడా చట్టబద్దమేనా? ఇది వారిని దోపిడీ చేయడం కాదా? అని ప్రశ్నించింది. మహిళల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంపై పోలీసులు చేపట్టిన దర్యాప్తు వివరాలను పూర్తిగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఐవీఎఫ్ కేంద్రాల వైద్యులు, నిర్వాహకులు పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని స్పష్టం చేసింది.


Related Post