కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ, ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధం అవుతోంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పాలనను ఎండగట్టేందుకు అదివారం వరంగల్‌లో జనచైతన్య సభ నిర్వహించబోతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హనుమకొండలోని కేడీసీ మైదానంలో ఈ సభ జరగబోతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు, ఎరువులు అందించడంలో వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూనే ఉంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నీళ్ళను దిగువకు వదిలేస్తూ తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం కలిగిస్తోందని వాదిస్తోంది.
నేటి సభలో ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ఎండగట్టబోతున్నారు. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ సభకు హనుమకొండని వేదికగా ఎంచుకున్నట్లు భావించవచ్చు.
కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన నాయకత్వంలోనే తెలంగాణకు పూర్వవైభవం వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతునందున, ఆయన ఈ సభకు హాజరవుతారా లేదా అనే దానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ సభలో ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డితో సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.
ఈ సభకు కనీసం 20 వేల మందికి పైగా హాజరవుతారని బీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గటుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.