యూపీ పోలీసులు చేసిన ఈ పనికి యావత్ దేశ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని భావించి ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో శనివారం చోటుచేసుకుంది.
ఈ పొరపాటు ఏవిధంగా జరిగిందంటే, సహరాన్‌పూర్‌లోని సర్క్యూట్ హౌస్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వస్తున్నట్లు సమాచారం అందుకున్న యూపీ పోలీసులు, ఆనవాయితీ ప్రకారం ఆయనకు గౌరవ వందనం చేసేందుకు అక్కడ సిద్దంగా ఉన్నారు.
అయితే అక్కడకి ముందుగా ఓవైసీ తన కాన్వాయ్‌తో అక్కడికి చేరుకున్నారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది కూడా ఉండటంతో పోలీసులు ఆయనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భావించి గౌరవ వందనం సమర్పించారు. అయితే ఓవైసీకి వారి అయోమయం గురించి తెలియదు కనుక పోలీసుల సెల్యూట్ స్వీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే కొద్ది సేపు తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన కాన్వాయ్‌తో అక్కడకు చేరుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు. అప్పుడు గానీ తాము పొరపాటు చేసినట్లు గ్రహించలేకపోయారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై యూపీ హోంశాఖ, పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. పొరపాటున ఓవైసీకి గౌరవ వందనం సమర్పించినవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ఓవైసీ స్పందిస్తూ, తనకు కూడా అక్కడ ఏం జరుగుతుందో మొదట అర్థం కాలేదని చెప్పారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించమని సూచించడంతో తాను అలాగే చేశానని తెలిపారు.
ఓవైసీ శనివారం ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి సహరాన్‌పూర్‌లో పర్యటించినప్పుడు సర్క్యూట్ హౌస్ వద్ద ఈ అనూహ్య ఘటన జరిగింది.