అగ్నివీరులకు శుభవార్త.. పెళ్ళికి అనుమతి!

November 22, 2026
img

అగ్నిపథ్ పథకంలో పనిచేస్తున్న అగ్నివీరులకు కేంద్రప్రభుత్వం ఇటీవల మరో రెండేళ్ళ సర్వీసు పొడిగించిన సంగతి తెలిసిందే. 2022లో ప్రారంభమైన అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన యువత నాలుగేళ్ళ పాటు సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో వారు వివాహం చేసుకోకూడదనే నిబంధన ఉంది.

అయితే అగ్ని వీరుల మొదటి బ్యాచ్ సర్వీస్ ఈ ఏడాదితో ముగుస్తుండటంతో, వారిలో 25 శాతం మంది అగ్నివీరులను మెరిట్ ఆధారంగా రెగ్యులర్ సర్వీసులోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 75 శాతం మందికి మరో రెండేళ్ళ పాటు సర్వీస్ చేసే అవకాశం కల్పించింది. ఆ తర్వాత వారు కూడా తగిన అర్హత సాధించి, సర్వీసులో కొనసాగేందుకు ఇష్టపడితే వారిని కూడా రెగ్యులర్ సర్వీసులోకి తీసుకోవాలని నిర్ణయించింది.  

కనుక నాలుగేళ్ళు పూర్తిచేసి, ఇప్పుడు ఈ రెండేళ్ళ అదనపు సర్వీస్ పీరియడ్‌లో చేరబోతున్నవారు పెళ్ళి చేసుకోవడానికి అనుమతించాలనే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.    

మహిళా అగ్నివీరులు పెళ్ళి చేసుకున్న తర్వాత గర్భం దాల్చితే వారికి ప్రసూతి సెలవులు, ఇతర మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా కల్పించాల్సి ఉంటుంది. కనుక దీనినీ పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. త్వరలో అధికారిక ఉత్తర్వులు, పూర్తి మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.

Related Post