కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో నేడు భేటీ అయ్యారు. అంటే ప్రభాస్‌ను బిజేపిలోకి ఆహ్వానించడానికా?అని సందేహం కలగడం సహజం. కానీ దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాలు నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించేందుకు కేంద్ర మంత్రి ప్రభాస్‌ను కలిశారు తప్ప బిజేపిలోకి ఆహ్వానించడానికి కాదు.
ప్రభాస్ వెంటనే అంగీకరించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారిరువురూ కలిసి ప్రచారానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
డ్రగ్స్ మహమ్మారిపై యువతలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ‘హైదరాబాద్ వాక్స్- నషా ముక్త్ భారత్’ పేరుతో అవగాహన యాత్ర చేపట్టనున్నారు. డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖుల మద్దతు కూడగట్టేందుకు కిషన్ రెడ్డి ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులను కలిశారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌తో పాటు దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీనులను కూడా కలిసి ప్రచారంలో భాగస్వాములు కావాలని కోరాగా వారు సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామిగా చేరారు. .
ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల ఆదరణ దృష్ట్యా ఆయన భాగస్వామ్యం ద్వారా డ్రగ్స్ వ్యతిరేక సందేశం మరింత మంది యువతకు చేరుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.