తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సాయితేజ ఈరమళ్ల (25) న్యూయార్క్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
స్థానిక పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. సాయితేజ నవంబర్ 18న న్యూయార్క్ స్టేట్ త్రూవే (ఐ-90)పై కారులో ప్రయాణిస్తున్నాడు. సాయంత్రం 6.30 గంటల సమయంలో అకస్మాత్తుగా రోడ్డుపైకి జింక రావడంతో, సాయితేజ కారు దానిని ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి శరవేగంగా వస్తున్న కార్గో వ్యాన్ రోడ్డుపై నిలిచిపోయిన ఆ కారును బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి మొత్తం నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో సాయితేజ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సహాయక బృందాలు అతడిని అంబులెన్స్‌లో సమీపంలోని సెయింట్ మేరీస్ ఆసుపత్రికి తరలించాయి. కానీ అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
సాయితేజ కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్ ద్వారా అల్బానీ మెడికల్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.
సాయితేజ స్వస్థలం నల్గొండ జిల్లాలోని మునుగోడు. అతను ఈరమళ్ళ ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడు. అతను అమెరికాలో ఉటికాలో నివసిస్తూ ఉన్నత చదువులు చదువుకుంటున్నాడు.
వారం రోజుల క్రితమే ఉద్యోగం లభించింది. వెంటనే తల్లితండ్రులకు ఫోన్ చేసి ఆ సంతోష వార్తను చెప్పాడు. కానీ ఇంతలోనే అతను చనిపోయినట్లు న్యూయార్క్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో అతని తల్లితండ్రులు షాక్ అయ్యారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆదివారం రాత్రికి సాయితేజ మృతదేహం అమెరికా నుంచి మునుగోడు చేరుకునే అవకాశం ఉంది.