తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’లో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“బిజేపి నాయకులు గొప్పలు తప్ప రాష్ట్రంలో బిజేపికి బలమే లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అభ్యర్ధుల కోసం వెతుకుంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తే కనీసం డిపాజిట్ దక్కలేదు. అలాంటి పార్టీ మాకు పోటీ కానే కాదు.
నా దృష్టిలో బిజేపి, మజ్లిస్ రెండూ కూడా మతం ఆధారంగా రాజకీయాలు చేసే పార్టీలే. ఆ రెండింటి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. బిజేపి హిందూ ఓట్ల కోసం, మజ్లిస్ ముస్లిం ఓట్ల కోసం మత ప్రాతిపాదికన రాజకీయాలు చేస్తూ ఉంటాయి. అంతే! ఒకవేళ కాదంటే, ఈసారి అమిత్ షా హైదరాబాద్ నుంచి మజ్లిస్ పార్టీతో పోటీ పడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్ని మతాల వారిని కలుపుకుని ముందుకు సాగుతుంది.
అటువంటి స్వభావం కలిగిన రాహుల్ గాంధీ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం చాలా అవసరం. మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను మతం పేరుతో విడదీసి తన అధికారం నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఇందుకోసం ఓట్లు చోరీ, డీలిమిటేషన్ వంటి అనేక కుట్రలు చేస్తోంది. దేశ ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచి అధికారంలోకి రావడం ఖాయం,” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ, “మాజీ సీఎం కేసీఆర్‌నే నా ప్రధాన రాజకీయ ప్రత్యర్ధిగా భావిస్తాను. కేటీఆర్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. కనుక బీఆర్ఎస్ పార్టీని ఉండనిస్తున్నాం. లేకుంటే ఎప్పుడో తుడిచిపెట్టేసేవాళ్ళం.
నిన్ననే సిద్ధిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేసి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత మరో పదేళ్ళపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగుతుంది,” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.