నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ ప్రోమో... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

November 24, 2026


img

మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా వెండితెరపై కోట్లాది మంది ప్రజలను అలరించి, ఇప్పుడు టీవీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు వచ్చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘చిరంజీవీస్ మెగావర్స్’ పేరుతో ఈ కార్యక్రమం రూపొందుతోంది. ఈ షోకు ఆయనే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది.

చిరంజీవి సినీ ప్రయాణానికి 48 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ ప్రోమోను ఆసక్తికరంగా రూపొందించారు. తాను నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెడుతున్న విషయాన్ని తెలియజేస్తూ ప్రోమోలో ‘ఇది నా అడ్డా’ అంటూ చిరంజీవి పంచ్ డైలాగ్ పలికారు.

ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో చిరంజీవి ముచ్చటించనున్నారు. 

వారి వ్యక్తిగత జీవితాలు, సినీ ప్రయాణం, ఆసక్తికరమైన అనుభవాల గురించి మాట్లాడనున్నారు. కమల్ హాసన్, నాగార్జున, ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, రవితేజ, నాని, బ్రహ్మానందం, సునీల్, సత్య, సందీప్ రెడ్డి వంగా, బాబీ కొల్లి తదితరులు ఈ షోలో పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో చిరంజీవి బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా తొలిసారిగా ఓటీటీ టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నాయి. నవంబర్ 30న సాయంత్రం 4.30 గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షో ప్రీమియర్ కానున్నట్లు తాజా సమాచారం.


Related Post

సినిమా స‌మీక్ష