మాజీ మంత్రి హరీష్ రావు గురువారం మీడియాతో మాట్లాడుతూ, “నాడు కేసీఆర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కేంద్ర మంత్రి ఎదుట కూర్చోబెట్టి రాయలసీమ ప్రాజెక్టు ఆపుతావా లేదా? లేకుంటే ఆలంపూర్ బ్యారేజ్ కడతా… నీళ్ళు గుంజుతా.. అంటూ మొహం మీదనే గల్లా పట్టుకొని చెప్పినట్లు కేసీఆర్ చెప్పారు,” అని అన్నారు.
ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి జోలికిపోకుండా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలనే హరీష్ రావు విమర్శిస్తున్నారు. తొలిసారిగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంతో ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ “హరీష్ రావు కుట్రల సంగతి తెలుసు. కనుక అనవసరంగా ఆ పెద్దాయనని మాట అనడం దేనికని ఊరుకున్నాం. కానీ ఈ అల్లుడు గిల్లుడు చూస్తూ కూడా కేసీఆర్ ఊరుకుంటే, అప్పుడు తప్పకుండా హరీష్ రావు కోరిక తీర్చేస్తాం. కేసీఆర్‌ని అనక తప్పదు,” అని ఘాటుగా హెచ్చరించారు.
ఇంతలోనే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ‘ఎక్స్’లో పెద్ద పోస్ట్ పెట్టారు. దానిలో రాయలసీమ ప్రాజెక్టు కొత్తది కాదంటూ శ్రీశైలం నుంచి నీళ్ళు వాడుకోవడాన్ని గట్టిగా సమర్ధించుకున్నారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే...
రాయలసీమ లిఫ్ట్ స్కీంపై, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన @ncbn తన హాట్‌లైన్ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాలకోసం మౌనంగా ఉన్నాడు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు, కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు! అదే కృష్ణానది, అవే నీళ్లు, అవే కేటాయింపులు, అదే పోతిరెడ్డిపాడు నుంచి అవే కాల్వల ద్వారా దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే, అవే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన, అవే జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్ స్కీం లాంటిదే ఈ పథకం. కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో, పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్య. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా, శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో, అంటే 44వేల క్యూసెక్కుల నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలి. ఆ నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేం. ఆ 880 అడుగులపైన రిజర్వాయర్ లెవల్ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారుతూ వస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేందుకు, పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 రోజుకు టీఎంసీ, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీ , ఎస్ఎల్బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీ, మొత్తంగా దాదాపుగా రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో జోరుగా ముందుకెళ్తోంది. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంగా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ స్కీంను చేపట్టాం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో లిఫ్ట్ చేసి, అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ పథకం ఉద్దేశం. నీటి కేటాయింపులు ఉన్నా, వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుంది? అదనపు నీటి కేటాయింపులు, అదనపు రిజర్వాయర్లు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి, ఏం నష్టం వస్తుంది? ప్రజల దాహార్తిని తీర్చే ఇన్సూరెన్స్ లాంటి రాయలసీమ లిఫ్ట్ స్కీంను భూతద్దంలో చూపించడం భావ్యమా? దురదృష్టవశాత్తూ, దాదాపుగా పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే, ఎక్కడ జగన్‌కు పేరువస్తుందోనని ఆపేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయాల్సింది పోయి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సిందిపోయి, హాట్‌లైన్ రాజకీయాలకోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువులాంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశాడు. ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదు. #RayalaseemaLiftIrrigation
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 26, 2026