ఢిల్లీలో యువతిపై సాటి ఉద్యోగులు సామూహిక అత్యాచారం

November 25, 2026
img

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో ఓ కేఫ్‌లో 22 ఏళ్ళ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి, నిందితులు ఓ కేఫ్‌లో సహోద్యోగులు. సోమవారం రాత్రి వీరంతా ప్రీత్ విహార్‌లోని సాల్టనేట్ కేఫ్‌లో పార్టీకి వెళ్లారు. రాత్రి 11.30 గంటలకు కేఫ్ మూసివేసినప్పటికీ, అక్కడ పనిచేసే వారిలో ఒకరి వద్ద తాళాలు ఉండటంతో తిరిగి తెరిచి పార్టీ కొనసాగించారు. ఈ క్రమంలో మద్యం సేవిస్తూ తెల్లవారుజామున 3.30 గంటల వరకు అక్కడే ఉన్నారు.

పార్టీ అనంతరం ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, మిగిలిన వారు వారికి సహకరించారని మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

న్యాయమూర్తి సమక్షంలో ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. నిందితులను నేడు కోర్టులో హాజరు పరచనున్నారు.

Related Post