తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యావిధానాన్ని రద్దు చేసి, పాఠశాల విద్యాశాఖ అధ్వర్యంలో 10+2 విద్యావిధానం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభ్యంతరం తెలిపారు.
తల్లిదండ్రులు, జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, పాఠశాలల యాజమాన్యాలు, విద్యావేత్తలతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “ఇంటర్ విద్యను స్కూల్ విద్యలో విలీనం చేస్తారా? లేక స్కూల్ విద్యను ఇంటర్లో కలుపుతారా? ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఇప్పటికే ఇంటర్ విద్య కోసం తల్లిదండ్రులు రూ.3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పాఠశాల విద్యలో 11, 12 తరగతులు ప్రవేశపెడితే తల్లిదండ్రులపై మరింత ఫీజుల భారం పడుతుంది.
విలీనం తర్వాత ల్యాబ్లు, మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది ఉన్నారా లేరా? ఈ కొత్త విధానం అమలు చేసేందుకు కార్పొరేట్ విద్యాసంస్థలను, వాటి ఫీజులను నియంత్రిస్తారా? ఏది ఏమైనప్పటికీ పిల్లల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ నూతన విద్యావిధానంపై సంబంధిత వర్గాలతో లోతుగా చర్చించి సాధక బాధకాలు తెలుసుకోవడం మంచిది. కాదని ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అంగీకరించం,” అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.