మహబూబ్‌నగర్‌లో దారుణం: ముంపు పరిహారం కోసం భర్త హత్య?

November 25, 2026
img

మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా దారుణం జరిగింది. ముంపు పరిహారం కింద ప్రభుత్వం నుంచి లభించే రూ.18 లక్షల కోసం ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.   

జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన గజ్జి మల్లికార్జున్ (23) పశువుల కాపరి. అతడికి మక్తల్‌కు చెందిన అంజమ్మతో వివాహమైంది. 

రెండు నెలల క్రితం వారు శ్రీశైలం వెళ్ళినప్పుడు దారిలో రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన శివ అనే వ్యక్తి వారికి బస్సులో పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో శివ తరచూ ఉదండాపూర్‌కు వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో అంజమ్మతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడిందని ఇరుగు పొరుగులు చెప్తున్నారు. 

మల్లికార్జున్ కుటుంబానికి ఉదండాపూర్ జలాశయం ముంపు పరిహారం కింద ఇటీవల రూ.18 లక్షలు అందాయి. ఈ డబ్బు కోసం అంజమ్మ, శివతో కలిసి భర్త మల్లికార్జున్‌ను హత్య చేసి శవాన్ని మాయం చేసి ఉండవచ్చనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ నెల 20న మల్లికార్జున్‌ ఇంటికి శివ బైక్‌పై వచ్చి అతనిని తీసుకు వెళ్ళాడు. మల్లికార్జున్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా, రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నెమళ్లగుట్ట సమీపంలో కూలీలు ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి వారికి సమాచారం ఇచ్చారు.

మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మంగళవారం అక్కడే ఖననం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంజమ్మ, శివల మధ్య అక్రమ సంబంధం ఉన్నందున వారే మల్లికార్జు న్ని హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 


Related Post