బేబీ దర్శకుడు సాయి రాజేష్‌కు కోర్టు నోటీసులు

November 26, 2026


img

సూపర్ హిట్ ‘బేబీ’ సినిమా విడుదలై మూడేళ్ళు. కానీ ఇంకా ఆ సినిమా కథ విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. దర్శకుడు సాయి రాజేష్‌, నిర్మాతలు ఎస్‌కేఎన్‌, ధీరజ్‌ మొగిలినేనికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

తన కథను అనుమతి లేకుండా ఉపయోగించి ‘బేబీ’ సినిమా తీశారంటూ షార్ట్‌ ఫిల్మ్‌ దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందిస్తూ వారికి నోటీసులు జారీ చేసింది. 

శిరిన్‌ శ్రీరామ్‌ ఏమంటున్నారంటే, నేను నా స్నేహితులతో కలిసి ‘ప్రేమించొద్దు’ అనే పేరుతో ఓ కథ తయారు చేసి సాయి రాజేష్కు వినిపించాను. అయన దీంతో సినిమా తీసేందుకు ఆసక్తి చూపారు. అప్పటి నుంచి దాదాపు ఏడాది పాటు నేను నా బృందం ఈ కథపై పనిచేశాము. 

అయితే కథ వివరాలు తెలుసుకున్న తర్వాత సాయి రాజేష్, నన్ను నా బృందాన్ని పక్కనపెట్టి అదే కథాంశంతో ‘బేబీ’ సినిమా తీసి విడుదల చేశారు. ఇది కాపీరైట్ హక్కులను ఉల్లంఘించడమేనంటూ శిరిన్‌ శ్రీరామ్‌ 2024లో రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ‘బేబీ లీక్స్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.

ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కోర్టుని ఆశ్రయించగా పిటిషన్ కొట్టి వేసింది. దానిపై శిరిన్‌ శ్రీరామ్‌ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్‌ బీఆర్‌ మధుసూదన్‌ రావు విచారణకు స్వీకరించి బేబీ దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను డిసెంబర్‌ 14కు వాయిదా వేశారు.


Related Post

సినిమా స‌మీక్ష