తిరుమల శ్రీవారికి కానుకగా 121 కిలోల బంగారు వజ్రాభరణాలు!

November 26, 2026
img

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు నేడు చిరు కానుక సమర్పించుకున్నారు. ఆ చిరు కానుక విలువ సుమారు రూ.206 కోట్లు. ఇంతకీ ఆ కానుక ఏమిటంటే 121 కిలోల బంగారు వజ్రాభరణాలు!

లక్షల కోట్లకు పడగలెత్తిన అంబానీలు, ఆదానీలు, పలువురు రాజకీయ ప్రముఖులు తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకొని భారీగా కానుకలు సమర్పించుకుంటారు. కానీ వారితో పోలిస్తే చాలా చిన్న పారిశ్రామికవేత్త అయిన వర్ధమాన్ జైన్ ఇంత భారీ కానుక సమర్పించుకున్నారు. .

టీటీడీ చరిత్రలో ఒక భక్తుడు ఇంత భారీ స్థాయిలో బంగారు ఆభరణాలను కానుకగా అందించడం ఇదే తొలిసారి.

వర్ధమాన్ జైన్ గత ఏడాది తన యాక్సెస్ హెల్త్‌కేర్ కంపెనీలోని మెజారిటీ వాటాను విక్రయించి, ఆ వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని శ్రీవారికి కానుకగా సమర్పించాలనుకున్నారు. 

టీటీడీ అధికారులు, అర్చకులు, ఆగమ శాస్త్ర నిపుణుల సూచనల మేరకు చెన్నైలోని ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థ చేత  శ్రీవారికి అలంకరించే కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు, అభయహస్తాలు, వడ్డాణం, భుజకీర్తులు, పాదుకలు, వజ్రాలు పొదిగిన హారాలు సహా మొత్తం 47 రకాల ఆభరణాలను 9 సెట్లుగా తయారు చేయించారు.  

వాటిని నేడు చెన్నై నుంచి ప్రత్యేక భద్రత కలిగిన వాహనంలో తిరుమలకు చేర్చారు. వర్ధమాన్ జైన్ కుటుంబ సభ్యులు రంగనాయకుల మండపం చేరుకొని వాటిని ఊరేగింపుగా ఆనంద నిలయానికి తీసుకువెళ్ళి అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వాటిని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

రేపు (శుక్రవారం) ఉదయం అభిషేక సేవ అనంతరం శ్రీవారిని ఈ నూతన స్వర్ణాభరణాలతో అలంకరించనున్నారు.

Related Post