ఆదిలాబాద్‌లో పరువు హత్య

November 27, 2026
img

ఆదిలాబాద్ జిల్లాలో కన్నకూతురిని తండ్రి గొంతు నులిమి హత్య చేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్, సుమిత్ర దంపతుల కుమార్తె కళ్యాణి (18)కు ఇటీవల ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. నవంబర్ 25న అంటే రెండు రోజుల క్రితం వారి వివాహ నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. అయితే కూతురు దిగులుగా ఉండటం గమనించి తండ్రి ఆమెను ప్రశ్నించగా తాను మేనత్త కుమారుడిని ప్రేమిస్తున్నానని, అతనినే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. 

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి పరువు పోతుందని ఆమె నిద్రిస్తున్నప్పుడు గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం. తర్వాత ఎవరికీ అనుమానం రాకూడదని ఆమె మృతదేహాన్ని ఫ్యానుకు వేలాడదీసి నిద్రపోయాడు. ఉదయం కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లి కేకలు వేయడంతో అతను కూడా మేల్కొని కుటుంబ సభ్యులతో కలిసి ఏడ్వడం మొదలుపెట్టాడు. వారి అరుపులు, ఏడ్పులు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. కూతురు ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులను, గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేశాడు.

అయితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించే ప్రయత్నం చేయడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. వారు వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

పోలీసులకు తండ్రి కైలాస్‌ తీరుపై అనుమానం కలిగి గట్టిగా ప్రశ్నించగా, కుమార్తె ప్రేమ వ్యవహారంతో పరువు పోతుందనే తాను ఆమెను హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేసి అతనిని అరెస్ట్ చేశారు. కల్యాణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Related Post