ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని రెండో అంతస్తులో ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది గమనించి అగ్నిమాపక సిబ్బందికి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మూడు అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదం జరిగిన గదిలో పలు కీలక రికార్డులతో పాటు, చెక్కులు కూడా ఉన్నట్లు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా నిప్పు పెట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం ఎంత జరిగింది? ఏయే కీలక రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.