హైదరాబాద్‌లో నీళ్ళ ట్యాంకర్లను అడ్డుకుంటే ఇంతేనా?

November 08, 2026
img

హైదరాబాద్‌ నగరంలో నీటి కొరత ఈనాటి సమస్య కాదు. ఎప్పటి నుంచో ఉంది. అయితే గత 15-20 ఏళ్ళలో నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంతో జనాభా దాంతో పాటు భవన నిర్మాణాలు పెరిగాయి. కానీ నగర జనాభాకు తగినట్లుగా నీటి సరఫరా వ్యవస్థ లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో నగర ప్రజలు తాగునీటి కోసం నీళ్ళ ట్యాంకర్లపైనే ఆధారపడక తప్పడం లేదు. 

అత్యంత విలాసవంతంగా నిర్మించిన బహుళ అంతస్తుల గెటడ్‌ కమ్యూనిటీలలో నీళ్ళ వాడకం ఇంకా ఎక్కువగా ఉంటుంది కనుక వాటిలో నివసిస్తున్నవారు సైతం నీళ్ళ ట్యాంకర్లపైనే ఆధార పడాల్సి వస్తోంది. 

అయితే ఎల్‌నినో ప్రభావంతో ఈసారి తగినంతగా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు ఇంకా అడుగంటిపోయాయి. కనుక నీళ్ళ ట్యాంకర్లకు మరింత డిమాండ్ పెరిగింది. 

ఈ నీళ్ళ ట్యాంకర్ల మాఫియా ఎంతగా విస్తరించిందంటే, నగరంలో సున్నపుచెరువు తదితర ప్రాంతాలలో అక్రమంగా బోర్లు, పైపులైన్లు వేసి భూమిలో నుంచి నీళ్ళు తోడేసుకుంటున్నాయి. ఇటీవల హైడ్రా వాటన్నిటినీ తొలగించడంతో ఆ సంస్థలకు ఎదురుదెబ్బ తగిలింది. 

ఇక ప్రభుత్వం ఆదేశం మేరకు జలసంరక్షణ మండలి సైతం నీళ్ళ ట్యాంకర్లపై పలు ఆంక్షలు విధించింది. అయితే అవేమీ అనుచితమైనవి కావు. త్రాగునీరు పరిశుభ్రంగా అందించాలంటే ట్యాంకర్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, దుమ్ము దూళీ పడకుండా మూతలు ఉండాలని, లీకేజులు ఉంటే నీళ్ళు వృధా అవుతాయి కనుక లేకుండా చూసుకోవాలని ఆంక్షలు విధించింది. 

మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నీటిని తెచ్చి నగర ప్రజలకు నిరంతరం నీళ్ళు అందించేందుకు చర్యలు చేపడుతోంది.  నీళ్ళ వ్యాపారంతో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకుంటున్న ట్యాంకర్ల మాఫియాకు ఇవన్నీ చాలా అసహనం కలిగిస్తున్నాయి. 

కనుక ఇందుకు నిరసనగా ఈ నెల 6న హైదరాబాద్‌లో కొన్ని చోట్ల నీళ్ళ ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చి రోడ్లపై నీటిని వృధాగా పారించారు. 

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ పక్క బకెట్ నీళ్ళు దొరక్క ప్రజలు అవస్థలు పడుతుంటే, మరోపక్క ప్రభుత్వం చుక్క నీటిని కూడా వృధా చేయవద్దని విజ్ఞప్తి చేస్తుంటే ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చి రోడ్లపై వృధాగా విడిచిపెడతారా? వీరిపై ప్రభుత్వం కటిన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Post