ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ‘రోమాంచకం’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీనిపై నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఇటీవల ప్రణయ్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పది సినిమాలు రిలీజ్ అయితే వాటిలో ఒకటో రెండో హిట్ అవుతాయి. కనుక మిగిలిన వాటిని విమర్శించడం, వాటిపై నెగెటివ్ రివ్యూలు వ్రాయడం చాలా తేలిక.
రోమాంచకం చిన్న సినిమా కనుక దానిపై ఇష్టం వచ్చినట్లు రివ్యూలు వ్రాశారు. రేపు ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమాపై కూడా ఇలాగే నెగెటివ్ రివ్యూలు వ్రాయగలరా? స్పిరిట్ విడుదలైనప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం,” అని ప్రణయ్ రెడ్డి అన్నారు.
ఎవరూ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని కోరుకోరు. మంచి కథలతో సినిమాలు రావాలని అందరినీ అలరించాలని,. నిర్మాతలకు లాభాలు, మిగిలినవారికి మంచి పేరు రావాలనే అందరూ కోరుకుంటారు. కానీ సినిమా బాగోనప్పుడు బాగోలేదని చెప్తే దర్శక నిర్మాతలకు బాధ కలుగుతుంది. బహుశః ప్రణయ్ రెడ్డి కూడా ఆ బాధతోనే ఈవిధంగా మాట్లాడి ఉండవచ్చు.
ఆయన చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ పోల్చి ఈవిధంగా మాట్లాడినప్పటికీ, తన సోదరుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘స్పిరిట్’ను ఎవరూ వేలెత్తి చూపలేనట్లు ఉంటుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు కూడా ఉంది.